శ్రీశైలం ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇంజినీర్లు, ఉద్యోగులకు ఘన స్మరణ – భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు
భూపాలపల్లి , ఆగస్టు 21(చక్రవాణి న్యూస్) :
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇంజినీర్లు, ఉద్యోగుల స్మారకార్థం కేటీపీపీలో సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని టీజీపీఈఏ, టీఎస్‌ఈఏఈఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేటీపీపీ చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రకాష్‌తో పాటు ఇంజినీర్లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రమాదంలో అసువులు బాసిన సహోద్యోగుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీర్ శ్రీ ప్రకాష్, ఉద్యోగులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సహోద్యోగుల త్యాగాలను ఎప్పటికీ మరువబోమని పేర్కొన్నారు. వారి సేవలు విద్యుత్ రంగానికి చిరస్మరణీయమని కొనియాడారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని తెలిపారు.
శ్రీశైలం విషాదం విద్యుత్ ఉద్యోగుల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా పాటించాలని సూచించారు. విధి నిర్వహణలో ఉత్పత్తి కంటే ప్రాణ భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీపీఈఏ, టీఎస్‌ఈఏఈఏ నాయకులు, కేటీపీపీ ఇంజినీర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొని అమరులైన తమ సహోద్యోగులకు కన్నీటి నివాళులు అర్పించారు.



No comments:
Post a Comment