మల్హర్ మండలంలో ఘోర ప్రమాదం..

కరెంట్ షాక్‌తో తండ్రీకొడుకులు అక్కడికక్కడే దుర్మరణం

మల్హర్ , ఆగస్టు 14 (చక్రవాణి న్యూస్) : పంటకు నీరు పోద్దామని వెళ్లిన ఆ తండ్రీకొడుకులను వ్యవసాయ మోటారే బలితీసుకుంది. ఆగిపోయిన మోటార్‌ను బాగుచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన అత్యంత హృదయ విదారక ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట శివారులో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామం మార్వాడీపల్లికి చెందిన కట్టెకోల బాపు (50), ఆయన కుమారుడు కట్టెకోల మహేష్ (25)లు ఇద్దరూ కలిసి గురువారం సాయంత్రం కొండంపేట శివారులోని తమ వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ రోడ్ డ్యాం సమీపంలో ఉన్న వ్యవసాయ మోటార్ పనిచేయకపోవడంతో, దానిని సరిచేసేందుకు ఇద్దరూ ప్రయత్నించారు.ఆ సమయంలో దురదృష్టవశాత్తు విద్యుత్ లైన్ల ద్వారా మోటార్‌కు భారీగా కరెంట్ సరఫరా అయింది. మొదట కుమారుడు మహేష్ కరెంట్ షాక్‌కు గురికాగా, ప్రాణాపాయంలో ఉన్న కొడుకును కాపాడేందుకు తండ్రి బాపు పరుగెత్తుకెళ్లాడు. కొడుకును లాగే క్రమంలో తండ్రికి కూడా బలమైన విద్యుత్ ఘాతం తగలడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే విగతజీవులుగా పడిపోయారు. 
 🔹 ఉదయం శవాలై కనిపించిన తండ్రీకొడుకులు
     రాత్రంతా ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల వెతికారు. తెల్లవారిన తర్వాత శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా.. ఇద్దరూ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
🔹 ఊరంతా శోకసంద్రం.. పోలీసుల దర్యాప్తు
కుటుంబానికి ఆధారమైన తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో గంగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. "ఇంటి పెద్ద దిక్కు పోయింది.. ఇక మా బతుకు ఎలా" అంటూ మృతుడి భార్య, కుమార్తెల రోదనలు అందరినీ కలచివేసాయి. సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments