చీరే కదా అని లైట్ తీసుకుంది.. మూడేళ్ల తర్వాత అడ్డంగా దొరికింది!

పక్కింట్లోనే చోరీ చేసి సైలెంట్‌గా ఉన్న దంపతులు.. ఫంక్షన్‌లో దొంగ చీర గుర్తించి పట్టించిన బాధితురాలు.

హైదరాబాద్ , (చక్రవాణి న్యూస్) : ఆసుపత్రికి వెళ్తే.. ఇల్లు గుల్ల చేశారు.      హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ వినాయక నగర్ ప్రాంతానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. 2023 సెప్టెంబర్ 16న ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స ముగించుకుని సెప్టెంబర్ 19న ఇళ్లకు తిరిగివచ్చేసరికి షాకింగ్ దృశ్యం ఎదురైంది. ఇంట్లోని రూ. 2,50,000 నగదు, 9 తులాల బంగారంతో పాటు కొన్ని విలువైన చీరలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పట్లో దొంగల ఆచూకీ లభించలేదు. 
 ఫంక్షన్‌లో మెరిసిన చీర.. ఎగిరిన గుండెలు
 ఇటీవల స్థానికంగా జరిగిన ఓ ఫంక్షన్‌కు యాదయ్య భార్య హాజరైంది. అక్కడ వారి ఇంటి వెనుక భాగంలోనే నివసించే స్వప్న (29) అనే మహిళ కట్టుకొచ్చిన పట్టుచీరను చూసి యాదయ్య భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ చీర మూడేళ్ల క్రితం తన ఇంట్లో చోరీకి గురైన చీరేనని ఆమె ఖచ్చితంగా గుర్తించింది. ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. 
 మొదట బుకాయింపు.. ఆపై నిజం ఒప్పుకోలు
 సమాచారం అందుకున్న పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్త రాములు (35)ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఆ చీర తనదేనంటూ స్వప్న పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసులు తమదైన శైలిలో నిలదీసేసరికి తలవంచక తప్పలేదు. 2023లో యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేసినట్లు దంపతులిద్దరూ ఒప్పుకున్నారు. 
 రిమాండ్‌కు దొంగల దంపతులు
 నిందితుల నుంచి దొంగిలించిన సొత్తును రికవరీ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు, వారిపై దొంగతనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. దొంగిలించిన సొమ్మును దాచుకున్నా.. ఫంక్షన్‌లో ముస్తాబవ్వాలనే ఒకే ఒక్క సరదా ఆ దొంగల దంపతులను మూడేళ్ల తర్వాత జైలు పాలు చేసింది

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments