కాంగ్రెస్ సర్కార్‌పై పుట్ట మధూకర్ నిప్పులు
కేటీఆర్ పిలుపుతో మంథనిలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా
ప్రజా పక్షాన పోరాటం ఆపేది లేదని హెచ్చరిక
మంథని , ఆగస్టు 18 (చక్రవాణి న్యూస్) :
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంథని నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా సరిగ్గా అమలు చేయలేదని మండిపడ్డారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరాగా నిలిచిన 'కళ్యాణలక్ష్మి', 'షాదీ ముబారక్' పథకాలను కుట్రపూరితంగా రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని నమ్మించి, ఇప్పుడు ఉన్న పథకాన్నే ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు వత్తాస్ పలకడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధిని విస్మరించి, కేవలం కూల్చివేతలు, దాడులు, కమిషన్లపైనే ఈ ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని విమర్శించారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచకపోగా, మహిళలకు ఇస్తామన్న జీవన భృతి, దళిత బంధు, ఆటో డ్రైవర్ల ఆర్థిక సహాయం వంటి హామీలను అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గ ప్రజలను దశాబ్దాలుగా వంచిస్తున్నారని, తప్పుడు కేసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. అనంతరం మహిళలతో కలిసి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.





0 Comments