కలెక్టర్‌ను కలిసి ఆసుపత్రి దుస్థితిని వివరించిన గ్రామ సర్పంచ్ బండి స్వామి
20 వేల జనాభాకు అవసరమైన అత్యవసర సేవలు కల్పించాలని వినతి పత్రం అందజేత
మల్హర్ , ఆగస్టు 18 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచేలా, పిహెచ్ సి ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని గ్రామ సర్పంచ్ బండి స్వామి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా సర్పంచ్ ఆయన్ను కలిసి ఆసుపత్రి దుస్థితిని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, తాడిచర్ల పరిసర ప్రాంతాలైన మల్లారం, చిన్నతుండ్ల, పెద్దతుండ్ల సహా సుమారు 20 వేల జనాభాకు ఈ ఆసుపత్రే దిక్కని తెలిపారు. రాత్రివేళల్లో వైద్యులు, అత్యవసర సేవలు లేకపోవడం వల్ల ఇటీవల ఇద్దరు వ్యక్తులు సమయానికి వైద్యం అందక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఇక్కడ 24 గంటల సేవలు అత్యంత అవసరమన్నారు.అలాగే సెల్లార్/లింటెల్ లెవల్‌లో నిలిచిపోయిన సబ్-సెంటర్ భవన నిర్మాణాన్ని, పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్ర అతిథి గృహాన్ని (గెస్ట్ హౌస్) వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




0 Comments