ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మల్లన్న – ధైర్యంగా ఉండాలని భరోసా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఆగస్టు 23, చక్రవాణి న్యూస్ : చిట్యాల మండలంలో ఇటీవల జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై జరిగిన దాడిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) మొదటి నుంచే తీవ్రంగా ఖండిస్తూ, బాధితుడికి అండగా నిలుస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తోందని టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు.ఈ సందర్భంగా పుల్ల రవీందర్‌కు టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫోన్‌లో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, రవీందర్ అంశాన్ని తాను ప్రతిరోజూ తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నానని తెలిపారు. పుల్ల రవీందర్‌కు టీఆర్పీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈరోజు పుల్ల రవీందర్ నివాసానికి రవి పటేల్‌తో పాటు టీఆర్పీ జిల్లా నాయకులు వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ఫోన్‌లో పుల్ల రవీందర్‌ను మాట్లాడించారు.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ బహుజన బిడ్డపై దాడి జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: రవి పటేల్
టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై ఎక్కడ దాడులు జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. బాధితులకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాడుతామని తెలిపారు. జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సాద మల్లన్న ముదిరాజ్, అబ్బేంగుల రాజయ్య, ముకిరాల సుధాకర్ రావు, ఇనుగోల పరిణయ రాజ్, మోటపోతుల సమ్మయ్య, వైద్య లక్ష్మణ్, పైడిపాల కుమార్ తదితర జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments