తీజ్ పండుగను అధికారికంగా నిర్వహిస్తాం.. మూడు రోజులు సెలవులు ఇస్తాం: కల్వకుంట్ల కవిత



 సింగరేణి కాలనీ అభివృద్ధికి సామాజిక న్యాయ తెలంగాణే పరిష్కారమని వెల్లడి

సింగరేణి కాలనీ హైదరాబాద్, ఆగస్టు 23(చక్రవాణి న్యూస్) : తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే బంజారా సంప్రదాయ పండుగైన తీజ్‌ను అధికారికంగా నిర్వహించడంతో పాటు, బంజారా ఆడబిడ్డలు కోరుతున్న విధంగా మూడు రోజుల సెలవులు కూడా ప్రకటిస్తామని తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.సింగరేణి కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నది ప్రధానంగా ఆడబిడ్డలేనని పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం, తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయడం, నేలపై నిద్రిస్తూ తీజ్ పండుగ ప్రాశస్త్యాన్ని నిలబెట్టడం ద్వారా బంజారా మహిళలు తమ సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారని కొనియాడారు.సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, బంజారా బిడ్డలు తమ సంస్కృతిని ఇదే స్ఫూర్తితో కాపాడుకోవాలని ఆకాంక్షించారు. సింగరేణి కాలనీలో గత 30 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని, గుడిసెలు, మురికి కాల్వలు అలాగే ఉండిపోవడంతో ప్రజల జీవితాల్లో అభివృద్ధి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల్లో సమాజంలో కచ్చితంగా మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో సామాజిక న్యాయ సంకల్పం తీసుకున్నామని తెలిపారు. ఆగస్టు 6న హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ సభ ద్వారా సామాజిక మార్పు కోసం కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టామని అన్నారు.అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని, ప్రతి వర్గం సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించబడాలని కవిత పేర్కొన్నారు. బంజారా బిడ్డలతో తెలంగాణ రక్షణ సేనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు.భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు కదలకుండా కార్యక్రమంలో పాల్గొనడం వారి ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనమని ప్రశంసించారు. తమ సంస్కృతికి బంజారా ప్రజలు ఇస్తున్న గౌరవాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతూ, తెలంగాణ రక్షణ సేనతోనే సామాజిక న్యాయ తెలంగాణ సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.




చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి


Post a Comment

0 Comments