మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి


పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అత్యుత్తమ డిజైన్లతో అభివృద్ధి చేయాలని ఆదేశం

 నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచన 

 సస్పెన్షన్ బ్రిడ్జి, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్ , ఆగస్టు 27 (చక్రవాణి న్యూస్) : హైదరాబాద్‌లోని మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కొనసాగుతున్న పనులను ఒక్కొక్కటిగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అత్యుత్తమ డిజైన్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనసాగుతున్న పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ద్వారా ప్రణాళికలను సీఎంకు వివరించారు. వాటిని పూర్తిగా పరిశీలించిన అనంతరం నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంత ట్యాంక్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణిస్తూ పరిశీలించారు. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనులను భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, చెరువు నుంచి మూసీలోకి వరద నీరు వెళ్లేలా నాలాను విస్తరించాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకుల కోసం చెరువులో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మీరాలం ట్యాంక్‌తో పాటు పరిసర ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ఈ ఆకస్మిక పర్యటనలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments