తాడిచర్లలో పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలి


శాంతిభద్రతల పరిరక్షణకు మంత్రి శ్రీధర్ బాబు చొరవ చూపాలని ప్రజల విజ్ఞప్తి

మల్హర్ , జూలై 23 (చక్రవాణి న్యూస్) : మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాంతం జెన్కో ఓపెన్ కాస్ట్ మైనింగ్ (ఓసిపి) ప్రాజెక్టుతో ఇప్పటికే పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇక్కడి కోల్ బ్లాక్-02ను సింగరేణి సంస్థకు కేటాయించడంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింతగా వృద్ధి చెందడమే కాకుండా వలసలు, జనాభా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఇక్కడ రానున్న రోజుల్లో శాంతిభద్రతల సమస్యలు మరింత జటిలమయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇక్కడ తగిన రక్షణ కల్పించేందుకు తక్షణమే ఒక పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 
నాటి అన్నల భయంతో తరలిన కార్యాలయాలు: 
  తాడిచర్ల ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గతం ఉంది. 1998వ సంవత్సరంలో ఇక్కడ నక్సల్స్ ప్రాబల్యం తీవ్రంగా ఉన్న సమయంలో, అప్పటి పీపుల్స్ వార్ సాయుధ నక్సలైట్లు తాడిచర్లలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆనాటి తీవ్ర అభద్రతా పరిస్థితుల దృష్ట్యా, అధికారులు ఇక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని, మండల పరిషత్ కార్యాలయాన్ని మంథని నియోజకవర్గ కేంద్రానికి తరలించారు. అదే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా ఇక్కడి నుంచి మార్చి కోయ్యూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. దీనివల్ల దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ మండల ప్రజలు తహసీల్దార్, మండల పరిషత్ సేవల కోసం మంథనికి వెళ్లాల్సి వచ్చింది. 
కార్యాలయాలు వచ్చాయి.. రక్షణ కరువైంది. 
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంథని నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పుట్ట మధూకర్ 2014 వారి హయాంలో.. ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి తాడిచర్ల కు వచ్చాయి. కాగ 2017లో జెన్కో ఓపెన్ కాస్ట్ మైన్ కూడా ప్రారంభం కావడంతో వేలాది మందికి ఉపాధి లభించి, తాడిచర్ల వేగంగా అభివృద్ధి చెందింది. అయితే, కార్యాలయాలు తిరిగి వచ్చినప్పటికీ పోలీస్ స్టేషన్ మాత్రం ఇంకా కోయ్యూరులోనే కొనసాగుతోంది. జనాభా పెరగడంతో తాడిచర్లలో నిత్యం ఏదో ఒక చోట గొడవలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కోయ్యూరు నుంచి పోలీసులు వచ్చేసరికి సమయం పడుతుండటంతో మెజారిటీ ప్రజలు తీవ్ర అభద్రతకు లోనవుతున్నారు. 
 మంత్రి చొరవ చూపాలి
 కోల్ బ్లాక్-02 మైనింగ్ కూడా ప్రారంభమైతే ఇక్కడ జనాభా మరింత పెరిగి, శాంతిభద్రతల సమస్యలు నియంత్రణ దాటే ప్రమాదం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నత పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పారిశ్రామికంగా మారుతున్న తాడిచర్ల పరిసర ప్రాంత ప్రజల రక్షణ కోసం ఇక్కడ తక్షణమే ఒక పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు.
పోలోజు సత్యనారాయణ రిటైర్డ్ హెల్త్ అసిస్టెంట్, తెలంగాణ ఉద్యమ కారులు

తాడిచర్ల పారిశ్రామికంగా ఎదగడం సంతోషకరం. ఇప్పటికే బ్లాక్-01 ఓపెన్ కాస్ట్‌తో జనాభా భారీగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా బ్లాక్-02 సింగరేణి బొగ్గు గని కూడా ఏర్పాటు కానుండటంతో ఈ ప్రాంతం మరింత పారిశ్రామిక కేంద్రంగా మారబోతోంది. ఈ వేగవంతమైన మార్పులకు అనుగుణంగా స్థానిక ప్రజలకు, అత్యవసర వైద్య సేవలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. అందుకోసం స్థానిక మంత్రి వర్యులు చొరవ తీసుకుని తాడిచర్లలో వెంటనే పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. 
కేసారపు నరేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు, మల్హర్ రావు 
 •తాడిచర్ల మైనింగ్ ప్రాంతంలో జనాభా పెరుగుతున్నందున, స్థానిక ప్రజల భద్రత కోసం వెంటనే పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేయాలి. పోలీస్ స్టేషన్ దూరంగా ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు వస్తున్నాయి శాంతిభద్రతల పరిరక్షణ కోసం స్థానిక మంత్రి, ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ ఔట్ పోస్టును మంజూరు చేయాలి.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments