భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

కేశవపూర్- పెగడపల్లి గ్రామాల మద్య  పొంగి పొర్లుతున్న వాగు (మహాముత్తారం) 

  1.  మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం.. 
  2. తాడిచర్ల ఓసీపీ-1లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి పనులు
  3. ఉధృతంగా పొంగుతున్న మోరంచ, చలివాగు.. లోతట్టు ప్రాంతాలు జలమయం.


భూపాలపల్లి , జూలై 29 (చక్రవాణి న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మల్హర్ రావు, మహదేవపూర్, మహాముత్తారం, టేకుమట్ల, రేగొండ, చిట్యాల మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు వాగులు, వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. 
మలహర్ లో 

 రోడ్డెక్కిన వాగులు.. స్తంభించిన రవాణా! 
 భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. టేకుమట్ల మండల పరిధిలోని చలివాగుతో పాటు, రేగొండ పరిధిలోని మోరంచ వాగు పూర్తిగా పొంగిపొర్లుతున్నాయి. వాగుల నీరు పలుచోట్ల రహదారులపైకి చేరడంతో గ్రామాలకు వెళ్లే రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేని ఈ వర్షాల దాటికి గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలు, వీధులు పూర్తిగా జలమయమయ్యాయి.
 కరువు వేళ ‘వరుణుడి’ పలకరింపు.. 
 ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక, తీవ్ర వర్షాభావ (కరువు) పరిస్థితులు నెలకొనడంతో జిల్లాలోని రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. పంటలు ఎలా సాగు చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్న తరుణంలో, రెండు రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలు అన్నదాతలకు పెద్ద ఊరటనిచ్చాయి. ఎండిపోతున్న పొలాలకు ఈ నీరు జీవం పోయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండటంతో వ్యవసాయ పనుల్లో వేగం పెంచేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి : రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మల్హర్ రావు మండల పరిధిలోని తాడిచర్ల జెన్కో ఓపెన్ కాస్ట్-1 (OCP-1) గనిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మైన్ పరిధిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ ఉపరితల గనిలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ఈ వర్షాల వల్ల గని నుండి తీయాల్సిన దాదాపు 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు, 2,40,000 క్యూబిక్ మీటర్ల ఊబి (ఓవర్ బర్డెన్ - OB) తొలగింపు పనులకు తీవ్ర ఆటంకం కలిగిందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కేఎస్ఎన్ మూర్తి మరియు మైన్ మేనేజర్ శ్రీనివాస్ సంయుక్తంగా తెలియజేశారు. గనిలో చేరిన నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే పనులను తిరిగి వేగవంతం చేస్తామని వారు పేర్కొన్నారు.





ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments