ఆన్‌లైన్ బెట్టింగుల వ్యసనం.. జూదానికి బానిసై.. అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు.. మానవత్వం మరిచిన విద్యార్థి!"
21 గంటలపాటు మృత్యువుతో పోరాటం!
కరీంనగర్, జూలై 6: కనుల నిండా కలలు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యావంతుడే.. క్షణికమైన ఆన్‌లైన్ వ్యసనాలకు దాసుడై, కన్నతల్లి లాంటి వృద్ధురాలి ప్రాణాలు తీసేందుకు వెనుకాడలేదు. బంగారు ఆభరణాల కోసం ఒక వృద్ధ మహిళను బావిలోకి తోసేసి, మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయిన ఒక యువకుడి ఉదంతం కరీంనగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
•గుండెకు అద్దుకునేలా.. మృత్యు గహ్వరంలో ఒక అమ్మ పోరాటం:
రెక్కాడితే గానీ డొక్కాడ నిరుపేద బతుకు ఆమెది. ఆ వయసులోనూ కడుపు నింపుకోవడానికి, నడుము వంగినా లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం ఎదురుచూస్తున్న ఆ వృద్ధురాలిని చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. కానీ, ఆన్‌లైన్ బెట్టింగ్ భూతానికి బానిసైన ఆ కిరాతకుడికి మాత్రం ఆమె మెడలోని అరతులం బంగారం, కాళ్లకు ఉన్న వెండి మట్టెలే కనిపించాయి. పని ఇప్పిస్తానని నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, సర్వస్వం దోచుకుని, సాక్ష్యం లేకుండా చేయాలని ఆ నిస్సహాయురాలిని బావిలోకి నెట్టేసాడు. చీకటి ముసిరిన ఆ బావిలో, శ్వాస ఆడని ఆ మృత్యు గహ్వరంలో.. దాదాపు 21 గంటల పాటు ఆ తల్లి ప్రాణాల కోసం ఎంతగా అల్లాడిపోయిందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఒంటిపై గాయాలు, చుట్టూ చల్లటి నీరు.. అయినా బతకాలనే ఆశతో బావిలోని మోటార్ పైపును గుండెకు అద్దుకుని రాత్రంతా ప్రాణాలతో పోరాడింది. ఎట్టకేలకు మరుసటి రోజు ఉదయం గ్రామస్థుల రూపంలో దేవుడు వచ్చి ఆమెను కాపాడాడు.
•వార్త పూర్తి వివరాలు: జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) అనే యువకుడు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై దాదాపు రూ.4 లక్షలు నష్టపోయాడు. ఆ అప్పులు తీర్చడానికి లోన్ యాప్ ద్వారా రుణాలు తీసుకోగా, నిర్వాహకులు డబ్బులు చెల్లించాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో దొంగతనానికి పథకం వేశాడు.ఈ నెల 1వ తేదీన కరీంనగర్ లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం నిలబడ్డ గంగాధర లక్ష్మీ అనే వృద్ధురాలిని పని ఇప్పిస్తానని నమ్మించి ర్యాపిడో బైక్‌పై నసుల్తాపూర్ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి, అర తులం బంగారం, 20 గ్రాముల వెండి ఆభరణాలను కాజేసి, ఆమెను బావిలో తోసేసి పరారయ్యాడు.మరుసటి రోజు ఉదయం బావిలోంచి బాధితురాలి అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్, నిందితుడు ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద దినేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ నగలను టవర్ సర్కిల్ వద్ద వేణు మనోహరాచారి అనే వ్యాపారికి రూ.30 వేలకు విక్రయించినట్లు విచారణలో తేలింది. నిందితుడితో పాటు ఆ దొంగ బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

0 Comments