పులివెందల నుంచే ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం
నామినేషన్లు అడ్డుకున్నారని జగన్ ఆరోపణలు
కార్యకర్తలకు అండగా ఉంటానని వెల్లడి
పులివెందల, చక్రవాణి న్యూస్: ఎన్నికల్లో ప్రత్యర్థులను పోటీకి రానివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా పులివెందలలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థులతో సమావేశమైన ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.పులివెందలలో 40 వార్డులకుగాను 20 వార్డుల్లోనే పోటీ చేసే పరిస్థితి కల్పించారని, ఏడు జడ్పీటీసీ స్థానాల్లో నాలుగు చోట్లే పోటీకి అవకాశం ఇచ్చారని జగన్ ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చించేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారని విమర్శించారు.
మహిళా అభ్యర్థులకు అన్యాయం
మహిళా అభ్యర్థులను అడ్డుకోవడం, వారిపై దాడులకు పాల్పడటం దారుణమని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం, విద్య, ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
అరెస్టులు, కేసులకు భయపడేది లేదని, కార్యకర్తల సమస్యలను తన సమస్యలుగా భావిస్తానని తెలిపారు. పోలీసులు, అధికారులు రాజ్యాంగానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పులివెందల నుంచి ప్రారంభమయ్యే ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు.

