మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి!
పాత పెట్రోల్ బంకు కూడలిలో లారీ టైర్ కింద పడి దుర్మరణం
మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
మంథని, అక్టోబర్ 25 (చక్రవాణి న్యూస్) : మంథని పట్టణంలోని పాత పెట్రోల్ బంకు ప్రధాన కూడలి వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మల్లెపల్లి గ్రామానికి చెందిన యువకుడు చింతల నవీన్ (28) మృతి చెందాడు. లారీ టైర్ కింద పడి యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పలువురు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రధాన రహదారిపై అధిక లోడుతో ఇసుక లారీలు వేగంగా తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాత పెట్రోల్ బంకు కూడలిలో ట్రాఫిక్ సిగ్నళ్లను తిరిగి ఏర్పాటు చేయాలని, రహదారికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. రోడ్డు మరమ్మతుల అనంతరం ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
