వరంగల్ అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
భద్రకాళి అమ్మవారి రథాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే నాయిని
పద్మాక్షి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హనుమకొండ, అక్టోబర్ 17 (చక్రవాణి న్యూస్): వరంగల్, హనుమకొండ నగరాల అభివృద్ధికి ఐటీ టవర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ (ఎడిషన్-2)ను ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి నగరంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. తొలుత పద్మాక్షి అమ్మవారిని దర్శించుకుని హోమపూజలో పాల్గొన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భద్రకాళి అమ్మవారి రథ నిర్మాణ పనులు పూర్తికావడంతో ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.అనంతరం వేయిస్తంభాల దేవాలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ నగరం చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాలకు నిలయమని, ఈ ప్రాంత వారసత్వ సంపదను కాపాడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు వరంగల్, హనుమకొండ నగరాల్లో ఐటీ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని నీలిమా రాజేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, పురోహితులు తదితరులు పాల్గొన్నారు.
