పొట్ట దశలో.. పట్టరాని వెతలు!
కాలువలు కబ్జా.. సాగునీటికి కటకట
బొగ్గులవాగు నీరందక ఎండుతున్న వరి
అధికారుల నిర్లక్ష్యంపై వల్లకుంట రైతుల ఆవేదన
మల్హర్, అక్టోబర్ 25 (చక్రవాణి న్యూస్ ):
చేతికందే దశలో ఉన్న వరి పంట సాగునీరు లేక కళ్లముందే ఎండిపోతుంటే.. ఆ అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. ఎడ్లపల్లి చిన్న నీటి తరహా ప్రాజెక్టు, బొగ్గులవాగు లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని సాగునీటి కాలువలు కబ్జాల కోరల్లో చిక్కుకోవడంతో వల్లెంకుంటతో పాటు కొయ్యూరు, కుంభంపల్లి, కొండంపేట, ఎడ్లపల్లి, రుద్రారం గ్రామాల్లోని ఆయకట్టుకు నీరందని దుస్థితి దాపురించింది. ఇరిగేషన్ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్లే తమ బతుకులు ఆగం అవుతున్నాయని సన్న, చిన్నకారు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ధ్వంసమైన గొలుసుకట్టు వ్యవస్థ..
ఒకప్పుడు కొయ్యూరు పోలీస్ స్టేషన్ కాలువ నుంచి మొదలుకొని బొమ్మారపు చెరువు వరకు.. మరోవైపు కొయ్యూరు సబ్స్టేషన్ చెరువు నిండి మానేరు వరకు, ఎడ్లపల్లి ఎక్స్ రోడ్డు, రుద్రారం చెరువు వరకు సాగునీటి కాలువలు గొలుసుకట్టుగా విస్తరించి ఉండేవి. అయితే, సొంతంగా బోర్లు వేసుకున్న కొంతమంది బడా రైతులు ఈ కాలువలను ఇష్టారాజ్యంగా ఆక్రమించి పూడ్చివేయడంతో కింది భాగంలో ఉన్న పేద రైతుల పొలాలకు చుక్క నీరు కూడా చేరడం లేదు. కాలువలకు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో ఈ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. కాలువల్లో నీరు లేకపోయినా మధ్యలో ఉన్న చిన్న చెక్ డ్యామ్ నీటితో వంతుల వారీగా పంటలు పారించుకునేవారమని, ఇప్పుడు ఎగువన ఉన్నవారు ఆ చెక్ డ్యామ్లలోనూ దౌర్జన్యంగా మోటార్లు పెట్టి నీటిని తోడేస్తున్నారని వల్లెంకుంటకు చెందిన గడిపల్లి సమ్మరాజు అనే సామాన్య రైతు వాపోయారు. పెట్టుబడులు శూన్యం.. లో-వోల్టేజీ సెగలు!
అకాల వర్షాలతో ఒకసారి పంటలు మునిగిపోతే.. ధైర్యం చేసి రెండు సార్లు నాట్లు వేశామని, ఎకరానికి రూ.25,000 వరకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని రైతులు పేర్కొంటున్నారు. మరోవైపు తీవ్రమైన లో-వోల్టేజీ సమస్య వల్ల మోటార్లు నడవక బావుల నుంచి కూడా నీటిని తోడలేకపోతున్నారు. "ఏ ప్రభుత్వం వచ్చినా, చివరకు తెలంగాణ వచ్చినా మా బతుకులు మారలేదు. మేము కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయాం. రాత్రింబగళ్లు పాములు, పురుగులు అని చూడకుండా ప్రాణాలు పణంగా పెట్టి కష్టపడినా మాకు మిగిలేది నష్టాలే" అని స్థానిక కూలీలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కాలువల కబ్జాలను తొలగించి, వారం రోజుల్లోగా నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.