పంచాయతీ రికార్డుల్లో ఉన్నా.. ఇంటిని కూల్చేశారు!
అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి
నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి: ఉప్పు బొంద్యాలు
మల్హర్ (చక్రవాణి న్యూస్): మండల కేంద్రమైన తాడిచర్ల శాత్రాజ్పల్లిలో తన భార్య ఉప్పు స్వప్న పేరుపై గ్రామ పంచాయతీ రికార్డుల్లో నమోదై, ఇంటి పన్ను చెల్లిస్తున్నప్పటికీ తమ ఇంటిని కూల్చివేయడం దౌర్జన్యమని గ్రామానికి చెందిన ఉప్పు బొంద్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని వాపోయారు. తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారమని, అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయడంతోపాటు నష్టపరిహారం చెల్లించి తమ కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
