తాడిచెర్లలో పెట్రోల్ దొంగతనాలు
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. పోలీసు గస్తీ పెంచాలి
మల్హర్,అక్టోబర్ 27(చక్రవాణి న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఎస్సీ కాలనీలో పెట్రోల్ దొంగతనాలు పెరిగిపోతుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల ముందు చెట్ల నీడలో పార్క్ చేస్తున్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ను అపహరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు.
పగలు, రాత్రి తేడా లేకుండా ఇళ్ల ముందు నిలిపిన బైకుల ట్యాంకులు తెరిచి పెట్రోల్ దొంగిలిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. దీంతో ఉదయం వాహనాలు తీసే సమయానికి ట్యాంకుల్లో ఇంధనం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
కాలనీలో సీసీ కెమెరాలు లేకపోవడం, తగిన నిఘా లేకపోవడంతో దొంగతనాలను గుర్తించడం కష్టంగా మారుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొయ్యూరు పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి కాలనీలో పోలీసు గస్తీని పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెట్రోల్ దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
