గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్
వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానం నుంచి పోటీకి ఖరారు
దసరా సందర్భంగా ప్రకటించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ఎన్నికల కోఆర్డినేటర్, అబ్జర్వర్‌గా సయ్యద్ ఇస్మాయిల్ నియామకం
హైదరాబాద్, అక్టోబర్ 20(చక్రవాణి న్యూస్) :
వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, సమన్వయం కోసం పార్టీ సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్‌ను రాష్ట్ర ఎన్నికల కోఆర్డినేటర్, అబ్జర్వర్‌గా నియమించారు.
ఉద్యమ నేపథ్యం.. విద్యార్హతలు
ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు.తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి కల్వకుంట్ల కవితకు అండగా నిలిచిన శ్రీకాంత్ గౌడ్.. పార్టీ అధికార ప్రతినిధిగా టీవీ చర్చా కార్యక్రమాలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ వాణిని వినిపించారు.
తొలిసారి ఎన్నికల బరిలో తెలంగాణ రక్షణ సేన
తెలంగాణ రక్షణ సేన పార్టీ స్థాపన తర్వాత తొలిసారిగా శాసన మండలి ఎన్నికల బరిలో అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి శ్రీకాంత్ గౌడ్‌ను ఎంపిక చేయడం ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి పార్టీ అడుగుపెడుతోంది.బహుజనుల సమస్యలు, హక్కులపై గత మూడేళ్లుగా పలు ఉద్యమాలకు రూపకల్పన చేసిన కల్వకుంట్ల కవిత.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే దిశగా ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
