కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన తాడిచర్ల గ్రామస్తులు
వారసత్వ భూములకు పట్టాలు ఇవ్వాలి
ధరణిలో అక్రమంగా పట్టాలు చేశారని ఆరోపణలు
మల్హర్, అక్టోబర్ 26(చక్రవాణి న్యూస్) : మల్హర్రావు మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ శివారులో తమ తాత సింగనవేని కర్రె చిన్నయ్య నుంచి వారసత్వంగా వచ్చిన భూములకు పట్టాలు మంజూరు చేయాలని తాడిచర్ల గ్రామానికి చెందిన సింగనవేని చిన్నయ్య, రాజయ్య, గంగయ్య, రాజమల్లు కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్లు 1104, 1121, 1122, 1153, 1154 లో తమ తాత పేరు పై పహని ప్రకారం ఉన్న భూములను ప్రస్తావించారు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ పేర్లపై నమోదు చేసుకోలేకపోయామని తెలిపారు. కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ధరణిలో అక్రమంగా పట్టాలు చేయించుకున్నారని ఆరోపించారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను పరిశీలించి వారసులమైన తమ పేర్లపై పట్టాలు, పాస్‌బుక్కులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
