తాడిచర్ల రోడ్డుకు తారు ఎప్పుడు? కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే పనులు జాప్యం... ఎమ్మార్పీఎస్
మల్హర్, అక్టోబర్ 4 (చక్రవాణి న్యూస్): తాడిచర్ల–భూపాలపల్లి రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్ పనుల్లో జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మల్హర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇందరపు సిద్దు ఆరోపించారు. పెద్దతుండ్ల నుంచి భూపాలపల్లి మార్గంలో పనులు అసంపూర్తిగా ఉండటంతో రహదారి గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండల కేంద్రమైన తాడిచర్ల నుంచి –కొయ్యూరు నాగులమ్మ దేవాలయం మార్గం బొగ్గు లారీల రాకపోకలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారిందన్నారు. అత్యవసర రోగులను తరలించే వైద్య వాహనాలకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయడంతో పాటు దెబ్బతిన్న ప్రాంతాలకు మరమ్మతులు చేపట్టాలని ఇందరపు సిద్దు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
