అర్ధరాత్రి శాత్రాజ్ పల్లి లో 400 ఇళ్ల కూల్చివేత!
సర్పంచ్ బండి స్వామి అడ్డుకున్నా ఆగని కూల్చివేతలు
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారంటూ బాధితుల ఆవేదన
మల్హర్ , చక్రవాణి న్యూస్:
మండల కేంద్రమైన తాడిచర్లలోని శాత్రాజ్పల్లి లో శనివారం అర్ధరాత్రి, రెవెన్యూ, పోలీస్, సింగరేణి, అగ్నిమాపక అధికారులు సుమారు 400 ఇళ్లను ఎనిమిది జేసీబీలతో కూల్చివేసి నేలమట్టం చేశారు. సుమారు 200 మందికి పైగా పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ, సింగరేణి, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఈ చర్య చేపట్టారు. తాడిచర్ల బ్లాక్-2 గని నేపథ్యంలో ఈ కూల్చివేతలు జరిగినట్లు తెలుస్తోంది.
సర్పంచ్ బండి స్వామి అభ్యంతరం
కూల్చివేతల సమాచారం తెలుసుకున్న సర్పంచ్ బండి స్వామి, గ్రామస్తులతో కలిసి అధికారులను అడ్డుకున్నారు. ముందుగా గ్రామసభ నిర్వహించి, నోటీసులు ఇచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. పేదలు అప్పులు చేసి లక్షల రూపాయలతో నిర్మించుకున్న ఇళ్లను అర్ధరాత్రి కూల్చడం అన్యాయమని వాదించినప్పటికీ, జేసీబీలతో కూల్చివేతలు కొనసాగాయని గ్రామస్తులు తెలిపారు.
పరిహారం కల్పించాలని డిమాండ్
ఇళ్ల నిర్మాణానికి కలపను ఇతర ప్రాంతాల నుంచి అటవీశాఖ అనుమతులు, రుసుములతో కలప తెచ్చుకున్నామని బాధితులు చెబుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంతో ఇంటి సామగ్రిని కూడా తొలగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లను కూల్చివేయడంపై చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారింది. కూల్చివేతలపై విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.
