ముట్టడి పిలుపుతో మాకేం సంబంధం లేదు
ఫోరం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో మమ్మల్ని ముడిపెట్టొద్దు
టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య
మల్హర్, అక్టోబర్ 26 (చక్రవాణి న్యూస్ ): ముఖ్యమంత్రి నివాస ముట్టడికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) పిలుపునిచ్చినట్లు జరుగుతున్న ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీయూఎఫ్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు యాదండ్ల గట్టయ్య స్పష్టం చేశారు. సోమవారం తాడిచర్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫోరం పేరుతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉద్యమకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కోసం త్వరలో వెబ్సైట్ ప్రారంభించి ఆదుకుంటుందనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ఫోరం అధికారికంగా పిలుపునివ్వని కార్యక్రమాలకు తమ సభ్యులను బాధ్యులుగా చేస్తూ ఇబ్బందులకు గురిచేయవద్దని పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫోరం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఉద్యమకారులు జరుగుతున్న ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలోజు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి బోయిని రాజయ్య యాదవ్, మండల అధ్యక్షుడు బూడిద సతీష్, ఉద్యమకారులు చొప్పరి రాజు, షేక్ చాంద్ పాషా, వెంకటస్వామి, గట్టయ్య, సారయ్య, పద్మ, విజయ, ఆకుల సదానందం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
