శాత్రాజుపల్లి ఇళ్ల కూల్చివేతపై జేఏసీ ఆగ్రహం
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి.. లేదంటే ఆందోళనలు
మల్హర్, అక్టోబర్ 13 (చక్రవాణి న్యూస్): భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజుపల్లిలో అర్ధరాత్రి నోటీసులు ఇవ్వకుండా సుమారు 350 ఇళ్లను కూల్చివేశారని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు ఆరోపించారు. బాధితులను పరామర్శించి, ఇళ్ల కూల్చివేతతో జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఏసీ మంథని నియోజకవర్గ నాయకులు చిట్యాల శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా నాయకులు కొత్తూరి రవీందర్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా సమ్మయ్య నాయక్ మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ సమయంలో అధికారులు అనుమతులు ఇచ్చి, ఇప్పుడు కూల్చివేయడం అన్యాయమన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, ఘటనపై ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌బాబు, జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ మండల నాయకులు పింగిళి వంశీ, రామిళ్ల రవి, పింగళి బన్నీ, మంత్రి రాజబాబుతో పాటు బాధితులు పాల్గొన్నారు.

