శాత్రాజుపల్లి బాధితులకు న్యాయం చేయాలి: మంత్రి శ్రీధర్‌బాబుకు సర్పంచ్ బండి స్వామి వినతి
శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేత.. బాధితుల సమస్యలపై మంత్రి సానుకూల స్పందన
మల్హర్, అక్టోబర్ 19 (చక్రవాణి న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును తాడిచర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజుపల్లిలో సర్వే నంబర్ 26లోని భూమి లావణి పట్టా భూమి అనే కారణంతో నాలుగైదేళ్లుగా నిర్మించుకున్న ఇళ్లను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ అధికారులు అర్ధరాత్రి కూల్చివేసిన ఘటనను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ నెల 10వ తేదీ శనివారం అర్ధరాత్రి రెవెన్యూ, అటవీ, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు భారీగా చేరుకుని ఇళ్లను నేలమట్టం చేశారని, సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేసి సమయం కోరినా పట్టించుకోలేదని వినతిపత్రంలో వివరించినట్లు తెలిపారు.ఈ ఘటనతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బండి స్వామి మంత్రిని కోరారు. బాధితుల సమస్యలను వివరంగా విన్న మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాత్రాజుపల్లి ఇళ్ల కూల్చివేత బాధితులు పాల్గొన్నారు.
