బాధితులకు అండగా ఉంటా సర్పంచ్ బండి స్వామి
మల్హర్, అక్టోబరు 11 (చక్రవాణి న్యూస్ ): తాడిచర్ల శత్రాజ్పల్లిలో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని సర్పంచి బండి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తాడిచర్ల ఓసీపీ-2 బ్లాక్ నేపథ్యంలో సింగరేణికి కేటాయించిన ప్రాంతంలో అక్రమ నిర్మాణాలున్నాయనే కారణంతో అధికారులు పది జేసీబీలతో రాత్రి ఒంటి గంటకు కూల్చివేతలు చేపట్టారని తెలిపారు.
గ్రామ ప్రథమ పౌరుడిగా అధికారులను వేడుకున్నా పట్టించుకోకుండా ఇళ్లను కూల్చివేయడం బాధాకరమన్నారు. అప్పులు చేసి, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి నిర్మించుకున్న ఇళ్లను కోల్పోయి పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. కనీసం నోటీసులిచ్చి సామగ్రి తీసుకునేందుకు సమయం ఇవ్వాల్సిందన్నారు. బాధితులకు నష్టపరిహారం, పునరావాస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడతానని బండి స్వామి స్పష్టం చేశారు.
