మా గూడు కూల్చేశారు.. న్యాయం చేయండి
నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాల కూల్చివేతపై ఫిర్యాదు
కలెక్టరేట్ ఎదుట బాధితుల ఆందోళన.. ధర్నా
మల్హర్, అక్టోబర్ (చక్రవాణి న్యూస్) : తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శాత్రాజ్‌పల్లి బ్లాక్-2 సింగరేణి బొగ్గు గని ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులు సోమవారం సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, గ్రామసభ నిర్వహించి సమాచారం అందించకుండా 400 ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర నిర్మాణాలను అర్ధరాత్రి కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రదేయపడిన కనికరించకుండా కూల్చివేశారు
తమ ఇళ్లను అన్యాయంగా అర్థ రాత్రి కూల్చివేయవద్దని అధికారుల కాళ్లావేళ్లా వేడుకున్నా కనికరించలేదని వాపోయారు. బంగారం కుదువపెట్టి, అప్పులు చేసి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి నిర్మించుకున్న ఇళ్లను నేలమట్టం చేయడంతో రోడ్డున పడ్డామని కన్నీటిపర్యంతమయ్యారు. పశువుల కొట్టాలు కూల్చివేయడంతో వాటి సంరక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.కూల్చివేతలపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు నష్టపరిహారం అందించాలని సర్పంచ్ బండి స్వామి కలెక్టర్‌ను కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కలిసి బాధితులు తమ గోడు వెళ్లబోసుకోగా, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్-2 బాధితులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

