నేడు ఆకాశంలో అరుదైన దృశ్యం.. భూమికి దగ్గరగా శనిగ్రహం
సాయంత్రం 5.59 గంటల నుంచి కనువిందు.. పరికరాలు లేకుండానే వీక్షించే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 4 (చక్రవాణి న్యూస్): ఆకాశ వీక్షకులకు ఆదివారం అరుదైన ఖగోళ దృశ్యం కనువిందు చేయనుంది. శనిగ్రహం భూమికి అత్యంత సమీప దూరానికి రానున్న నేపథ్యంలో సాయంత్రం ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించనుంది. సాయంత్రం 5.59 గంటల నుంచి ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది.శనిగ్రహం తూర్పు ఆకాశంలో లేత పసుపు రంగులో ప్రకాశవంతంగా కనిపించనుంది. రాత్రి వేళ సాధారణంగా ఎలాంటి ప్రత్యేక పరికరాలు లేకుండానే శనిగ్రహాన్ని చూడవచ్చని ఖగోళ నిపుణులు తెలిపారు.అయితే బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ద్వారా వీక్షిస్తే శనిగ్రహం చుట్టూ ఉన్న ప్రత్యేకమైన వలయాలను కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.సాధారణంగా భూమికి సుమారు 126 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే శనిగ్రహం, ఇలాంటి సమీప స్థితికి గతంలో 2025 సెప్టెంబర్ 21న వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆకాశంలో కనిపించనున్న ఈ అరుదైన దృశ్యాన్ని ఖగోళ ప్రియులు, విద్యార్థులు ఆసక్తిగా వీక్షించే అవకాశం ఉంది.
