ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్పుపై అధ్యయనం చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు
కులగణన ఆధారంగా న్యాయం.. మంత్రివర్గ ఉపసంఘం ద్వారా పరిశీలన
హైదరాబాద్, అక్టోబర్ 22 (చక్రవాణి న్యూస్) : ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా, సంబంధిత వర్గాలతో చర్చించి ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సాయన్నపై రూపొందించిన పాటలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన వివరాల ఆధారంగా ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.గతంలో సరైన గణాంకాలు లేని కారణంగా ముదిరాజ్‌లను మరో బీసీ గ్రూపులోకి మార్చే ప్రతిపాదనలకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం కులగణన ద్వారా బీసీలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయని, న్యాయనిపుణులు, అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చడం వల్ల గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందనే అపోహలను తొలగించేందుకు సంబంధిత వర్గాలతో చర్చించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు.
పోరాటయోధులకు సముచిత గౌరవం
నిరుపేదలు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. పాలమూరు ప్రాంతానికి చెందిన సాయన్న పోరాట స్ఫూర్తి గర్వకారణమని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్, జ్యోతిరావు పూలే విగ్రహాల తరహాలోనే ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
కులగణనతో సామాజిక న్యాయం
కులగణన ద్వారా బలహీనవర్గాలకు తమ హక్కులను సాధించుకునే అవకాశం లభించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. వివరాల్లో తప్పులు ఉన్నా, ఎవరి పేర్లయినా నమోదు కాకపోయినా సరిచేసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సామాజిక న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిందని గుర్తుచేస్తూ, సంక్లిష్టమైన సామాజిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పారు. ఆలస్యమైనా ఎవరికీ అన్యాయం జరగకుండా చూడటం తన బాధ్యతని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను మెరుగుపరిచాం
గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ, 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, రైతు భరోసా కింద రూ.12 వేల అందజేత వంటి కార్యక్రమాలను వివరించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను కూడా ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
