పేదల ఇళ్లపై బుల్డోజర్లు.. ఇదేనా ప్రజాపాలన?
మంత్రి శ్రీధర్‌బాబు మౌనం ఎందుకు?
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
మల్హర్, అక్టోబర్ 11 (చక్రవాణి న్యూస్ ): తాడిచర్ల శత్రాజ్పల్లిలో అర్ధరాత్రి పేదల ఇళ్ల కూల్చివేతపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంటి సామగ్రిని తీసుకునే అవకాశం కల్పించకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు.అప్పులు చేసి, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి ఒక్కో ఇంటికి రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు ఖర్చు చేసిన పేదలకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో గతంలో బాధితులకు నష్టపరిహారం ఇప్పించిన విషయాన్ని గుర్తుచేస్తూ, శత్రాజ్‌పల్లి బాధితుల విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.బాధితులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బీజేపీ బాధితుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
