పెద్దతూండ్లలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
శాంతి, అహింసా మార్గాలను స్మరించుకుంటూ గాంధీజీకి ఘన నివాళులు – స్వీట్ల పంపిణీ
మల్హర్, అక్టోబర్ 2 (చక్రవాణి న్యూస్) : మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. “శాంతి దూత – ప్రేమే లక్ష్యం, సేవే మార్గం” అనే నినాదంతో మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింసా మార్గాలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.భారతీయులకు శాంతియుత పోరాటాల ద్వారా స్వాతంత్ర్య సాధనలో మార్గనిర్దేశం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గ్రామ పెద్దలు గతంలో పెద్దతూండ్ల గ్రామంలో గాంధీజీ విగ్రహాన్ని స్థాపించగా, ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున పార్టీలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి వేడుకల్లో పాల్గొని ఆయన సేవలను స్మరించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగా రావు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా విద్యార్థులకు, గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు.
