ఆదిలోనే రైతన్న ఆశలు ఆవిరి.. పంటలపై మూగజీవాల దాడులు!
ఆరుగాలం కష్టానికి ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు మూగజీవాల దాడులు
మల్హర్, అక్టోబర్ 23 (చక్రవాణి న్యూస్) : ఓవైపు సాగునీటి కొరత, విద్యుత్ కోతలు మరోవైపు కోతులు, అడవి పందుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు పంట చేతికొచ్చేలోపే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.మండలంలోని కుంభంపల్లికి చెందిన రైతు ముల్కల రాజేశ్వర్రెడ్డి పొలం వద్ద కోతులు మోటార్ స్టార్టర్లు, పైపులు, విద్యుత్ పరికరాలను ధ్వంసం చేయడంతో నష్టం వాటిల్లింది. ఇప్పటికే వర్షాలు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న తమకు కోతులు, అడవి పందుల బెడద అదనపు భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని పలు గ్రామాల్లో కోతులు వరి పంటలను దెబ్బతీస్తుండగా, అడవి పందులు పొలాల్లోకి చొరబడి పంటలను తొక్కుతూ నాశనం చేస్తున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా దక్కుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంటలను కాపాడాలి
కోతులు, అడవి పందుల బెడద నివారణకు అటవీ శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పంటలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
