మల్హర్లో అడవి పందుల బెడద.. రైతులకు తీవ్ర నష్టం!
ఓ వైపు అడవి పందులు.. మరోవైపు కోతుల దాడులు
వరి, పత్తి పంటలు ధ్వంసం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
పంటలను కాపాడేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి
మల్హర్, అక్టోబర్ 20 (చక్రవాణి న్యూస్) : ఓ వైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు అడవి పందులు, కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయంలో జంతువుల దాడులకు గురవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాలు లేక బోర్లు, బావుల కింద సాగు చేసిన పంటల దిగుబడిపై ఆశలు సన్నగిల్లగా, ఉన్న కొద్దిపాటి పంటలను సైతం అడవి పందులు, కోతులు ధ్వంసం చేస్తుండటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
పలు గ్రామాల్లో పెరిగిన బెడద
మండలంలోని పెద్దతుండ్ల, తాడిచర్ల, మల్లారం, కొయ్యూరు, ఎడ్లపల్లి, రుద్రారం, కొండంపేట, నాచారం, అంసాన్ పల్లి తదితర గ్రామాల్లో అడవి పందుల సంచారం పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాల్లోకి చొరబడుతున్న అడవి పందులు వరి, పత్తి పంటలను నాశనం చేస్తుండగా, కోతుల గుంపులు సైతం పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టి పంటలను కాపాడుకునేందుకు శ్రమిస్తున్న రైతులకు ఈ పరిస్థితి భారంగా మారింది. పంట చేతికొచ్చే వరకు కాపలా కాయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
అడవి పందులు, కోతుల బెడద నుంచి పంటలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, పంటలకు నష్టం కలగకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మరింత నష్టం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
