తాడిచర్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో సత్కారం
విద్యార్థుల భవిష్యత్ రూపకల్పనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
మల్హర్, అక్టోబర్ 6 (చక్రవాణి న్యూస్): మల్హర్ మండలం తాడిచర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో తాడిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు. సర్పంచ్ బండి స్వామి స్వయంగా కార్యక్రమాన్ని నిర్వహించి, ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా బండి స్వామి మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశానికి వెన్నెముక లాంటి వారని కొనియాడారు. విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని అన్నారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి తమ జీవితాలను అంకితం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, లభించిన పురస్కారాలు తమపై మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. తిరుపతి, సన్మాన గ్రహీతలు సిహెచ్. పూర్ణచందర్, రాధిక, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పద్మతో పాటు ఉపాధ్యాయులు తిరుపతి, కవిత, మానస, అరుణ్, శ్రీనివాస్, సురేష్, గంగరాజు, రమేష్, సాంబయ్య, ఉపాధ్యాయ బృందం, సీఆర్పీ సమత తదితరులు పాల్గొన్నారు.
