ఓవైపు కోతులు.. మరోవైపు అడవి పందులు!
ఎకరం పంట ధ్వంసం.. ఆదుకోవాలని కలెక్టర్కు రైతు సమ్మయ్య వేడుకోలు
మల్హర్ , అక్టోబర్ 26 (చక్రవాణి న్యూస్):
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, నిద్రాహారాలు మాని పంటలను కాపాడుకుంటున్న రైతులకు ఓవైపు కోతులు, మరోవైపు అడవి పందుల బెడద వెంటాడుతోంది. ఇంకోవైపు లో వోల్టేజీ సమస్యతో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటికి తోడు అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.కుంభంపల్లి గ్రామానికి చెందిన రైతు కుంభం సమ్మయ్య తనకున్న ఎకరం పొలంలో సాగు చేసిన పంటను అడవి పందులు ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికందే సమయంలో నష్టం జరగడంతో పెట్టుబడులు ఎలా రాబట్టుకోవాలో తెలియడం లేదన్నారు. అధికారులు స్పందించి అడవి పందుల బెడదను అరికట్టాలని, పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించడంతోపాటు రైతుల పొలాలకు శాశ్వత రక్షణ కల్పించాలని జిల్లా అధికారులను కోరారు.
