ఫేక్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కల్వకుంట్ల కవిత
డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం
మూడు కార్పొరేషన్లలో జెండా ఎగురవేస్తామని వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 23(చక్రవాణి న్యూస్) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై స్పష్టత ఇవ్వకపోతే డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన **‘టీఆర్ఎస్ రాజధాని రణభేరి సభ’**లో ఆమె ప్రసంగించారు. హైదరాబాద్‌లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకుంటోందని, గతంలో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ల ద్వారా వాస్తవంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయో వెల్లడించాలని కోరారు. పరిశ్రమల కోసం రైతుల నుంచి సేకరించిన భూములను సీఎం తన సోదరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. జవహర్‌నగర్ డంప్‌యార్డు కాలుష్యం, వీధి కుక్కలు, దోమల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఉపాధికి ఏఐ వల్ల ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక విధానం రూపొందించాలని కవిత కోరారు. చెత్త సేకరణ వాహనాలపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 50 వేల మంది ఉపాధికి నష్టం కలిగించవద్దని అన్నారు. కూరగాయలు, చేపలు విక్రయించే చిరు వ్యాపారులకు సైతం ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు, మెరుగైన ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతోపాటు నగరంలో మెరుగైన రహదారులు, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందిస్తామని తెలిపారు. మహిళలు, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే జీహెచ్‌ఎంసీ సహా మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజల్లో ఉండాలని సూచించారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం కావాలని, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ గౌడ్‌కు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
