కాళేశ్వరం నీటిని వినియోగించడంలో నిర్లక్ష్యమెందుకు?
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం
భూపాలపల్లి, అక్టోబర్ 24 (చక్రవాణి న్యూస్) : గోదావరి జలాలను వినియోగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు వహిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రశ్నించింది. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ప్రాణహిత నుంచి నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, ఆ జలాలను ఎత్తిపోసి రైతులకు అందించడంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది.ప్రాణహిత నుంచి 20 వేల క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు ప్రవహిస్తోందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న గోదావరి జలాలను వృథా కానివ్వకుండా కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని ఎత్తిపోసి ప్రజలకు, రైతులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా, నీటి లభ్యత ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంపుహౌస్ మోటార్లను ప్రారంభించాలని కోరారు. నీటి వినియోగంలో నిర్లక్ష్యం కొనసాగితే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జక్కు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

