తెలంగాణలో హ్యుందాయ్ భారీ పెట్టుబడులు.. 4,276 ఉద్యోగాలే లక్ష్యం!
జహీరాబాద్ నిమ్జ్‌లో రూ.8,528 కోట్లతో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం
కార్ల తయారీ పరిశ్రమలకు హైదరాబాద్ అనుకూలమని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి
మల్హర్, అక్టోబర్ 17 (చక్రవాణి న్యూస్):తెలంగాణలో ఆటోమొబైల్, తయారీ రంగాల అభివృద్ధికి భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ కార్ల తయారీ పరిశ్రమలకు అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది.
ఈ సందర్భంగా జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కేంద్రం పురోగతిని ప్రతినిధులు వివరించారు.ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ.8,528 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, 678 ఎకరాల్లో దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. తద్వారా 4,276 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న నెలల్లో కేంద్రానికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉండటంతో పాటు హైదరాబాద్‌లో మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని సీఎం వివరించారు. రహదారి, రైలు, విమాన మార్గాల అనుసంధానం, ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం, ప్రణాళికాబద్ధమైన ప్రాంతీయ అభివృద్ధి ద్వారా పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం కల్పిస్తామని చెప్పారు.2024 ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా హ్యుందాయ్ ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం, 2025 జూన్‌లో ఈ ఆర్ అండ్ డీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక ఉపసంఘం ఆమోదం తెలిపింది. 2026లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని సీఎం సంస్థ నాయకత్వాన్ని ఆహ్వానించారు.తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో తెలిపారు. సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
