ఎండిన పొలం.. మండిన గుండె! పొలంలో బైక్‌తో యువరైతు నిరసన
నీళ్లు లేక.. కరెంటు రాక.. ఎండుతున్న మూడెకరాల వరి
గొల్లపల్లిలో రైతు ప్రవీణ్ ఆవేదన.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
భూపాలపల్లి, అక్టోబర్ 23 (చక్రవాణి న్యూస్) : సాగునీరు అందక.. విద్యుత్ సరఫరా లేక.. కళ్లముందే వరి పంట ఎండిపోతుండటంతో యువరైతు ప్రవీణ్ ఆవేదనతో వినూత్న నిరసనకు దిగాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లిలో తన మూడు ఎకరాల పొలంలో ద్విచక్ర వాహనంతో తిరుగుతూ నిరసన వ్యక్తం చేశాడు. పంటను కాపాడుకోవాల్సిన సమయంలో నీరు, కరెంటు అందకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.కష్టపడి సాగు చేసిన పంటకు నీరందక, విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోయాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీరు, విద్యుత్ అందించి పంటను కాపాడాలని కోరాడు. లేదంటే ఆత్మహత్యే శరణ్యమంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.