గోదావరి పుష్కర పనులు గడువులోగా పూర్తి చేయాలి
భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.. అధికారులకు ముఖ్య కార్యదర్శి ఆదేశం
భూపాలపల్లి , అక్టోబర్ 12 (చక్రవాణి న్యూస్): గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. సోమవారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు.పుష్కర ఘాట్లు, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐడీఓసీ నుంచి పాల్గొన్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో పుష్కర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో దేవాదాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
