ఫేక్ అకౌంట్లతో రూ.26 లక్షల మోసం!
అమ్మాయిల ఫొటోలతో పరిచయాలు.. ఆపై బెదిరింపులు
బాధితుల్లో అధికారులు, వైద్యులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు
చక్రవాణి న్యూస్ | హైదరాబాద్
సోషల్ మీడియాలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో నకిలీ ఖాతాలు సృష్టించి, పలువురిని మోసం చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసిన యువకుడిని సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగేళ్లలో దాదాపు వెయ్యి మందిని మోసగించి రూ.26.16 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కె. పవన్‌కుమార్ (23) ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివసిస్తున్నాడు. గతంలో పలు కంపెనీల్లో పనిచేసిన అతడు, ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్బుక్లో 14 నకిలీ ఖాతాలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయిల పేర్లు, ఫొటోలతో యువకులు, పురుషులకు పరిచయమై వారి వ్యక్తిగత వివరాలు, అభ్యంతరకరమైన ఫొటోలను సేకరించేవాడని వెల్లడించారు.
బెదిరింపులతో డబ్బుల వసూళ్లు
వ్యక్తిగత ఫొటోలు, వివరాలు సేకరించిన అనంతరం తాను ఆ అమ్మాయి సోదరుడినని చెప్పి బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. మరికొందరిని పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. నకిలీ ఖాతాల కోసం కోల్‌కతాకు చెందిన ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ యువతి ఫొటోను ఉపయోగించినట్లు తెలిపారు.
పలు రాష్ట్రాలు, విదేశాల్లోనూ బాధితులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో ఇన్స్పెక్టర్లు, అదనపు డీసీపీలతో సహా 14 మంది పోలీసు అధికారులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, గిగ్ వర్కర్లు ఉన్నట్లు వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం
బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
