ఓటర్ల జాబితాపై ఈసీ కీలక చర్యలు
నోటీసుల పరిష్కారం తర్వాత ప్రత్యేక నమోదు డ్రైవ్‌కు సన్నాహాలు
హైదరాబాద్, అక్టోబర్ 3 (చక్రవాణి న్యూస్): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. సవరణ ప్రక్రియలో మిగిలిపోయిన అర్హులైన ఓటర్లు, తొలిసారి ఓటు హక్కు పొందే యువతను గుర్తించి నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది.తెలంగాణలో సవరించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. నోటీసుల పరిష్కార ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగనుండగా, తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నారు.తుది జాబితా అనంతరం BLOలు గత జాబితాతో కొత్త జాబితాను పరిశీలించి, పేర్లు మిగిలిపోయిన అర్హులైన ఓటర్లను గుర్తించనున్నారు. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించి, అర్హత ఉన్నవారి నుంచి ఫారం-6 ద్వారా నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతను కూడా ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నమోదు చేయనున్నారు.ప్రస్తుతం నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత గడువులో సంబంధిత పత్రాలు సమర్పించి విచారణ ప్రక్రియలో పాల్గొనాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. సెప్టెంబర్ 29 నాటికి తెలంగాణలో 92,88,180 నోటీసులు జారీ కాగా, వాటిలో 45,54,236 మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
మీ చక్రవాణి న్యూస్
అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం
నిరంతరం తాజా వార్తలు
