విద్య, వైద్యంపై సీఎం రేవంత్ కీలక సమీక్ష
ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి.. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 3 (చక్రవాణి న్యూస్): రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సీఎంవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం.. ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఉస్మానియా ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఆస్పత్రుల నిర్మాణం పూర్తయ్యేలోపు అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. వైద్య పరికరాల కొనుగోళ్లను కూడా వేగవంతం చేసి, ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చే నాటికి పూర్తిస్థాయి వైద్య సేవలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, ఆస్పత్రులను పరిశీలించాలని సీఎం సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.అనంతరం డిసెంబర్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై సమీక్షించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
