ఫ్యూచర్ సిటీలో ఎన్ఐయూఎం ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
రూ.200 కోట్లతో నిర్మాణం.. 20 ఎకరాల భూమి కేటాయింపు
2028 జూన్ 2 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 19(చక్రవాణి న్యూస్) : భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం) నూతన ప్రాంగణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాంగణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది.
2009 నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు
జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) కింద 2009లో ఎంపికైనప్పటికీ, భూమి కేటాయింపు లేకపోవడంతో ఎన్ఐయూఎం ఏర్పాటు ప్రక్రియ ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం భూమి కేటాయించడంతో ప్రాంగణ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
పట్టణాభివృద్ధికి కీలకం
తెలంగాణలో పట్టణ విధానాల రూపకల్పన, కార్యాచరణ ఆధారిత పరిశోధన, పట్టణ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో ఎన్ఐయూఎం కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రాంగణ నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాల పరిశీలన
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణ పనులు, పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

