జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
ఫేజ్-2 సెన్సస్ ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం
డిజిటల్ విధానంలో వివరాల నమోదు.. సమాచార గోప్యతకు ప్రాధాన్యం
భూపాలపల్లి, అక్టోబర్ 23(చక్రవాణి న్యూస్) : జిల్లాలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను సమగ్రంగా, పకడ్బందీగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జనగణన ఫేజ్-2 శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, శిక్షణ తరగతులను పరిశీలించారు. అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు.గతంలో హౌస్ లిస్టింగ్ ఫేజ్-1 ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని, అదే స్ఫూర్తితో ఫేజ్-2 జనాభా లెక్కల సేకరణను కూడా సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. జనగణన ద్వారా సేకరించే వివరాలు భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు కీలకమని పేర్కొన్నారు.ఈసారి డిజిటల్ విధానంలో మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్), కులాల వారీగా వివరాల సేకరణకు సంబంధించిన అంశాలపై సిబ్బంది పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు సంబంధిత మాన్యువల్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సందేహాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు.
సమాచార గోప్యత తప్పనిసరి
జనగణన చట్టం–1948 ప్రకారం సేకరించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అనధికార వ్యక్తులతో సమాచారాన్ని పంచుకోకూడదని, ప్రతి ఇంటి వివరాలను నిబంధనల ప్రకారం కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. జనగణన ప్రక్రియ విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు, సీపీఓ కిష్టయ్య, ఆర్డీఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు, వివిధ శాఖల అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

