రూ.50 వేల కోసం హత్య.. నిందితుడికి జీవిత ఖైదు!
ఐదేళ్ల విచారణ అనంతరం తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
భూపాలపల్లి అక్టోబర్ 9, (చక్రవాణి న్యూస్):
రూ.50 వేల కోసం వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడు పెరుగు రమేష్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామానికి చెందిన పెరుగు రమేష్ (26), పర్లపెల్లి గ్రామానికి చెందిన అక్కపెల్లి మల్లయ్యతో కలిసి 2020 సెప్టెంబర్ 4న ఆకినపల్లిలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ మల్లయ్య తన అవసరాల కోసం రూ.50 వేలు డ్రా చేసుకున్నాడు. అనంతరం రమేష్ ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.మరుసటి రోజు పర్లపెల్లి గ్రామ శివారులోని తన వ్యవసాయ క్షేత్రం బావిలో మల్లయ్య మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మొగుళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
