నైపుణ్యమే ఉన్నత కొలువుకు బాట! రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
భూపాలపల్లి, అక్టోబర్ 9 (చక్రవాణి న్యూస్) : యువత చదువుతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత వేతనాలతో కూడిన ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 142కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. ప్రారంభమైన రెండు గంటల్లోనే 600 మందికి పైగా యువత ప్రాథమికంగా ఎంపికైనట్లు వెల్లడించారు. కొన్ని కంపెనీలు ఒక్కొక్కటి 100 నుంచి 400 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపాయని పేర్కొన్నారు.ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనంతో ఉద్యోగంలో చేరినా, అనుభవం, నైపుణ్యాలను పెంచుకుంటే రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు వేతనం పొందే అవకాశాలుంటాయని మంత్రి వివరించారు. వ్యవసాయం, కూలీ పనులు, చిన్న వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి కష్టాన్ని గుర్తించి యువత ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యం
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతో పాటు టాస్క్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని శ్రీధర్‌బాబు తెలిపారు. అర్హతలతో పాటు నైపుణ్యాలు ఉన్నప్పుడే మెరుగైన ఉద్యోగాలు, పదోన్నతులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి మరింత మందికి ఉపాధి కల్పించేలా ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు మంత్రి వివరించారు. గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తూ అర్హులకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. యువత ఉద్యోగాల కోసం ప్రాంతీయ పరిమితులు విధించుకోకుండా, ఎక్కడ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలని సూచించారు.భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రహదారుల అభివృద్ధి, పట్టణంలో రోడ్ల విస్తరణ, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 10 వేల నుంచి 12 వేల వరకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గత ఏడాది నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 2,700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు. టాస్క్ ద్వారా జిల్లాలో నైపుణ్య శిక్షణను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ సహకారంతో శిక్షణ కేంద్రానికి విశాలమైన హాలు, ఏసీ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 142కు పైగా కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయని తెలిపారు. స్థానికంగానే కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున యువత తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందజేశారు. జాబ్‌మేళా నిర్వహణలో విశేష కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్, టాస్క్ సీఈఓ ప్రదీప్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధి హామీ పథకం సభ్యులు దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.



