భూపాలపల్లిలో 9న మెగా జాబ్ మేళా
300కుపైగా కంపెనీల భాగస్వామ్యం.. 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
భూపాలపల్లి, అక్టోబర్ 3 (చక్రవాణి న్యూస్):నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం–టాస్క్ ఆధ్వర్యంలో ఈ నెల 9న భూపాలపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. జాబ్ మేళాను విజయవంతం చేయాలని జిల్లాలోని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిలోని పుష్ప గార్డెన్స్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాలో 300కుపైగా కంపెనీలు పాల్గొననున్నాయని, సుమారు 20 వేల మంది నిరుద్యోగ యువత హాజరయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాంగణంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.సుమారు 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువత కోసం ఉచిత రవాణా, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో 2,770 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో టాస్క్ ప్లేస్మెంట్ టీమ్ లీడర్ ప్రదీప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
