బీసీ రాజ్యాధికారమే లక్ష్యం.. తీన్మార్ మల్లన్న పాదయాత్ర!
2028లో బీసీ ముఖ్యమంత్రి
లక్ష్యంగా ఐక్య పోరాటం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు సంఘటితమైతేనే సామాజిక న్యాయం: రవి పటేల్
భూపాలపల్లి అక్టోబర్ 16(చక్రవాణి న్యూస్):తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార పాదయాత్రలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పీ అధ్యక్షుడు రవి పటేల్ పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్నతో కలిసి పాదయాత్రలో నడిచిన ఆయన, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే అణగారిన వర్గాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14,500 కిలోమీటర్ల లక్ష్యంతో సాగుతున్న ఈ పాదయాత్ర బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందిస్తోందని రవి పటేల్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బీసీ రాజ్యాధికారం, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీ వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని రవి పటేల్ అన్నారు.
బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం కల్పించినప్పుడే సామాజిక న్యాయం బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు.2028 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని వర్గాలు ఐక్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని పిలుపునిచ్చారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.బీసీలు తమ ఓటు విలువను గుర్తించి, విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి, సామాజిక గౌరవం వంటి అంశాలతో పాటు రాజకీయ హక్కుల సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని రవి పటేల్ సూచించారు. తీన్మార్ మల్లన్న పాదయాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు బీసీ రాజ్యాధికార ఉద్యమానికి బలాన్నిస్తోందని అన్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం ముందుకు సాగాలని, రాజకీయ అధికారంలో సముచిత వాటా సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌తో పాటు మడెం సంతోష్, మధుకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
