బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం!
కాంగ్రెస్, బీఆర్ఎస్లతోనే బీసీలకు అన్యాయం
- బీసీ రిజర్వేషన్ల అమలులో పాలకుల నిర్లక్ష్యం
- జనాభా ప్రాతిపదికన వాటా సాధించడమే లక్ష్యం
- బీసీ రాజ్యాధికార యాత్రతో ప్రజల్లోకి వెళ్లిన తీన్మార్ మల్లన్న
జడ్చర్ల, అక్టోబర్ 14 (చక్రవాణి న్యూస్):బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా దక్కాలంటే రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు.
బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా జడ్చర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాల్సిన పాలకులు హామీలకే పరిమితమవుతున్నారని మల్లన్న ఆరోపించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర బడుగు వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వాలు స్పష్టమైన కార్యాచరణ చూపాలని డిమాండ్ చేశారు.రాజకీయ పార్టీల హామీలను నమ్మి మోసపోవద్దని, బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీ రాజ్యాధికార యాత్ర ద్వారా గ్రామగ్రామాన ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు. బీసీలకు న్యాయమైన వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. బీసీలకు రాజకీయంగా సముచిత వాటా దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మల్లన్న డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
