బీసీ రాజ్యాధికారానికి గ్రాడ్యుయేట్ ఓటే ఆయుధం!
అర్హులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: టిఆర్పీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్
భూపాలపల్లి, అక్టోబర్ 24 (చక్రవాణి న్యూస్): బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత, రాజ్యాధికారం దక్కాలంటే అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు నవంబర్ 6తో ముగియనున్న నేపథ్యంలో అర్హులంతా గడువులోగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినవారు కూడా ప్రస్తుత ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలని రవి పటేల్ సూచించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన గ్రాడ్యుయేట్లు సంబంధిత ధ్రువపత్రాలతో నమోదు చేసుకోవాలని కోరారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో టీఆర్పీ నాయకులు నమోదు ప్రక్రియకు సహకరిస్తారని తెలిపారు.బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలని రవి పటేల్ డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకొని తమ హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు పెరిగితేనే ప్రజాస్వామ్యంలో తమ గొంతును బలంగా వినిపించగలమని పేర్కొన్నారు.టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీ రాజ్యాధికార సాధన కోసం పార్టీ పోరాడుతోందని రవి పటేల్ తెలిపారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్పీ బీసీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, మోటపోతుల సమ్మయ్య, సురేందర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.